గేట్ పరీక్ష
మన దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో(PSU) ఉద్యోగాలకి, ఎంటెక్, పీహెచ్డీ ప్రవేశాలకు; విదేశాల్లో కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఎమ్మెస్ ప్రవేశాలకు GATE పరీక్షలో స్కోరును ప్రామాణికంగా తీసుకొని నేరుగా ప్రవేశాలు కల్పించడం లేదా మౌఖిక పరీక్షకు అర్హత కల్పించడం జరుగుతుంది. ఈ నియామకాల్లో ఆయా సంస్థల నిబంధనల దృష్ట్యా గేట్ స్కోరుకు 50-80 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు బీటెక్ అయిన తరువాత మంచి జీతంతో ఉద్యోగం, ప్రోత్సాహకాలు, స్థిరమైన జీవితం కోసం కాంక్షించే వారికి గేట్ ఒక మంచి ఎంపిక. ఈ పరీక్ష ఏడాదికొక్కసారి ఫిబ్రవరి మొదటి, రెండవ వారంలో జరుగుతుంది.
ఐఐటీ, ఐఐఎస్సీ, ఎన్ఐటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదవాలని కలలుగనే వారు గేట్ పరీక్ష ద్వారా ఎం.టెక్ కోర్సులో ప్రవేశం పొంది, కోర్సు పూర్తి చేస్తూ ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యి భారీ ప్యాకేజీలు అందుకునే ఆస్కారం ఉంది. గేట్ ద్వారా ఎం.టెక్ లో చేరిన వారికి నెలవారీ 12,400 రూపాయలు ఉపకార వేతనం అందుతుండటంతో ముఖ్యంగా పేద, మధ్య తరగతి విద్యార్థులు తమ చదువుకు, స్వంత ఖర్చులకు పెద్దగా ఇంట్లో వారిపై ఆధారపడనవసరం లేదు. అంతేకాకుండా ఎంటెక్ కోర్సు పరిశోధన ఆధారిత కోర్సు కావడంతో తాము ఎంచుకున్న సబ్జెక్టులో లోతైన అవగాహన కలగడానికి తోడ్పడుతుంది.
ప్రతి సంవత్సరం దేశం మొత్తంలో పదిహేను లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్దులు పట్టభద్రులవుతుండగా సుమారు తొమ్మిది నుండి పది లక్షల మంది విద్యార్థులు ఏటా ఈ పరీక్షను రాస్తున్నారు. బీటెక్ లో దాదాపు అన్ని ముఖ్యమైన బ్రాంచులకీ ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. బేసిక్ సైన్సెస్ అయిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎర్త్ సైన్సెస్, మాథ్స్, బయో సైన్సెస్ లో కూడా ఈ పరీక్ష ఉంటుంది. వీరికి కూడా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకి, పీహెచ్డీ ప్రవేశాలకు గేట్ స్కోర్ ఉపయోగపడుతుంది. పీహెచ్డీలో ప్రవేశం పొందిన వారికి ప్రతి నెల 31,000 రూపాయల ఉపకార వేతనం అందడం మంచి విషయం.
మొత్తానికి GATE పరీక్ష ఉన్నతమైన అవకాశాలకు ఒక ద్వారం (Gate) లాంటిది.
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పరీక్షకి దేశ వ్యాప్తంగా లక్షల్లో విద్యార్థులు హాజరవ్వడం, పైన చెప్పిన అవకాశాలకి, దరఖాస్తు చేసిన విద్యార్థుల కంటే ఖాళీలు చాలా చాలా తక్కువగా ఉండటం వల్ల దానికి అనుగుణంగా ఈ పరీక్ష కఠినంగానే ఉంటుంది. అందువల్ల ఏటా కేవలం 15-19 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించగలుగుతున్నారు. ఉత్తీర్ణత సాధించినా కూడా టాప్ ర్యాంకు వస్తే గానీ మెరుగైన అవకాశాలు వచ్చే మార్గం లేకపోవడంతో పోటీ మరింత తీవ్రంగా ఉంటుంది.
ఆన్ లైన్ విధానంలో జరిగే పరీక్షలో మూడు గంటల వ్యవధిలో గరిష్టంగా వంద మార్కులకు సమధానం ఇవ్వాలి. ఒకసారి ప్రశ్నల సరళిని గమనిస్తే సంబంధించిన బ్రాంచ్ అవసరాలకు అనుగుణంగా వివిధ సెక్షన్లు ఉంటాయి. పేపరును బట్టి ఆప్టిట్యూడ్, గణితం, అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టులో ప్రశ్నలు ఉంటాయి. మిగతా సెక్షన్లతో పోలిస్తే అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకి ఎక్కువ మార్కులు ఉంటాయి. కొన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో, మరికొన్ని సంఖ్యాబంధమైన ప్రశ్నలు ఉంటాయి. అంటే అడిగిన సమస్యకు సమాధానం లెక్కించి సరైన సమాధానం అంకెల రూపంలో స్క్రీన్ మీద ఇచ్చిన ఖాళీలో నమోదు చేయాలి.
ప్రశ్న యొక్క కఠినత్వాన్ని బట్టి ఒక్కో ప్రశ్నకు 1 లేదా 2 మార్కులు ఉంటాయి. రెండు మార్కుల ప్రశ్నలు ఒక్క మార్కు ప్రశ్నలతో పోలిస్తే కఠినంగా మరింత లోతుగా ఉంటాయి. తప్పు సమాధానానికి ఒక మార్కు ప్రశ్నకు -0.33 , రెండు మార్కుల ప్రశ్నకు -0.66 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. సంఖ్యా సంబంధమైన ప్రశ్నలకు నెగటివ్ మార్కింగ్ ఉండదు.
ఈ పరీక్షలో తరచుగా చేసే పొరపాట్ల వల్ల అధిక సంఖ్యలో విద్యార్థులు విజయం సాధించలేకపోతున్నారు. వీటిని ఉద్దేశిస్తూ వాటి పరిష్కారాలు కూడా ఇక్కడ ప్రస్తావించాను.
- సిలబస్
గేట్ పరీక్షను ఐఐటీలు నిర్వహిస్తాయి. ప్రతీ ఏడాది ఒక ఐఐటీ నిర్వహణా బాధ్యతలు చేపడుతుంది. సెప్టెంబరులో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వివిధ సబ్జెక్టులకు నిర్దిష్టమైన సిలబస్ ను ఇస్తారు. ఈ సిలబస్ ను పూర్తిగా అనుసరించాల్సిన అవసరం ఉంది. అందులో ప్రతీ అంశాన్నీ క్షుణ్ణంగా, విశ్లేషణాత్మకంగా చదవాలి. అన్ని విషయాలపై లోతైన అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. ప్రశ్న ఏ మూల నుండైనా రావచ్చు. చాలా మంది విద్యార్థులు చేసే తప్పు, తమకు సులభంగా ఉన్న చాప్టర్ ను బాగా చదివి కష్టంగా ఉన్న చాప్టరును నిర్లక్ష్యం చేసి పోతేపోయాయి ఒకటో రెండో మార్కులు అని వదిలేస్తారు. ఒకవేళ మనం బాగా చదివిన టాపిక్ లో కష్టమైన ప్రశ్న వచ్చి సమాధానం చెయ్యలేనప్పుడు రెంటికీ నష్టం వస్తుంది. కష్టంగా ఉన్న అంశాలేవైనా సరే సాధన ద్వారా సులభతరం చేసుకోవచ్చు లేదా కనీసం ఆ అంశంలోని బేసిక్స్ నేర్చుకున్నా సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు.
2. పుస్తకాల ఎంపిక
మనం ఎంచుకున్న సబ్జెక్టులో వివిధ అంశాలకు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను ఖచ్చితంగా చదవాలి. వాటిలో ఉన్న అన్ని చిత్రాలు, గ్రాఫులు, ముఖ్యమైన సూత్రాలు విశ్లేషించాలి. ముఖ్యమైన పాయింట్లన్నీ స్పష్టంగా ఒక పుస్తకంలో రాసుకోవాలి. రాసినది మర్చిపోకుండా తరచుగా చూస్తూ ఉంటే మంచిది. బీటెక్లో సెమిస్టర్ పరీక్షలకు చదివిన ఆల్ ఇన్ వన్లు, గైడ్లు ఇక్కడ పని చేయవు. టాపర్ల నుండి వారు చదివిన పుస్తకాలు, అనుసరించిన మెటీరియల్ ను తెలుసుకొని అవి చదవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.
3. సాధన
మునుపటి సంవత్సరం పరీక్షా పత్రాలను సాధన చెయ్యడం మర్చిపోకూడదు. మొదటగా ఒక అంశాన్ని చదివి ఆ అంశంలో ఇప్పటివరకూ ఇచ్చిన ప్రశ్నలను సాధించడం ద్వారా మనం సరైన దారిలో వెళుతున్నమా లేదా అనే విషయం అర్ధమవుతుంది. ఒక్కొక్క ప్రశ్నకీ సమాధానం పొందినప్పుడు మనకి ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. ఎక్కడ తప్పు చేస్తున్నామో అర్ధమయ్యి దాన్ని సరిదిద్దుకొనే వీలుంటుంది.
4. సమయ పాలన
చాలా మంది అభ్యర్థులు చెప్పే విషయం సమయం సరిపోలేదనీ, కొన్ని ప్రశ్నలు కష్టంగా ఉండటం వల్ల ఎక్కువ సమయం వెచ్చించి మిగతా ప్రశ్నలకు సమయాన్ని వృథా చేసుకున్నామని చెప్తారు. బాగా చదివిన వారు కూడా సమయం సరిపోలేదనీ పరీక్ష హాలు బయటికొచ్చాక భోరున విలపించిన సందర్భాలు ఉన్నాయి. దీనికి ఒకే ఒక పరిష్కారం ఏదైనా ప్రశ్న ఎక్కువ సమయం తీసుకుంటున్నా, ప్రశ్న తికమకగా ఉండి విసిగిస్తున్నా దాన్ని అప్పటికి వదిలేయాలి. కంగారు పడకూడదు. చివరలో సమయం మిగిలినప్పుడు మళ్లీ ప్రశాంతంగా ఆలోచించవచ్చు. అంతకీ రాకపోతే పూర్తిగా వదిలివెయ్యడం మంచిది. లేదంటే దాని ప్రభావం మిగతా ప్రశ్నలపై పడుతుంది.
పరీక్షకు సిద్ధం అయ్యే సమయంలోనే పూర్తిగా పరీక్ష వాతావరణంలో మూడు గంటలు సమయం పెట్టుకొని మునుపటి సంవత్సరం పేపర్లు, వీలైనన్ని మాక్ టెస్టులు నిజాయితీగా ప్రయత్నించడం ద్వారా సమయపాలన అలవాటవుతుంది. పరీక్షలో ఒత్తిడి ఉండదు. ఏ సమయంలో ఏ సెక్షన్ ప్రయత్నించాలో, ఒక ప్రశ్నకు గరిష్టంగా ఎంత సమయం కేటాయించాలో ప్రణాళిక వేసుకోవాలి. పరీక్ష సమయంలో మన ఆలోచనలు చివరి నిమిషం వరకూ స్థిరంగా ఉండాలి.
5. నెగటివ్ మార్కింగ్
ఇది చాలా ముఖ్యమైనది. ర్యాంక్ డిసైడర్. తప్పు సమాధానానికి ఒక మార్కు ప్రశ్నకు -0.33 అని రెండు మార్కుల ప్రశ్నకు -0.66 నెగటివ్ మార్కింగ్ ఉందనీ, ఒక్క మార్కు కోల్పోయినా ర్యాంకు వేలల్లో లేదా వందల్లో పడిపోతుందనీ గుర్తుంచుకోవాలి. అసలు కొన్ని ప్రశ్నల ప్రధాన ఉద్దేశ్యం అభ్యర్థి సమయాన్ని పాడు చేసేలా, అభ్యర్థిని తప్పు సమాధానం ఇచ్చే విధంగా తయారుచేయబడతాయి. ఉదాహరణకు ఆప్టిట్యూడ్లో అర పేజీ పేరా ఇచ్చి దానికి సమాధానం గుర్తించమని ప్రశ్న ఉంటుంది. నిజానికి ఆ ప్రశ్నకి సమాధానం చాలా సులభంగా వస్తుంది కానీ అర పేజీ పేరా చదివే క్రమంలో విలువైన సమయం వృధా అవుతుంది.
కొన్ని సందర్భాల్లో మనకి సరైన సమాధానం వచ్చినా ప్రశ్నలో ఉండే ఏదొక మతలబు తప్పు సమాధానం ఇచ్చేలా చేస్తుంది. ముఖ్యంగా ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు అన్ని ఆప్షన్లు సరియైన సమాధానంలానే అనిపిస్తాయి. వీటి నుండి ఉత్తమమైన సమాధానం జాగ్రత్తగా నిర్ణయించి గుర్తించాలి. లేదంటే నెగటివ్ మార్కుల వలలో పడే ప్రమాదం ఉంది.
6. ఖచ్చితత్వం
సంఖ్యా సంబంధమైన ప్రశ్నలను చేసేటప్పుడు అన్ని ప్రమాణాలు ఒకే యూనిట్లలో ఉండేలా చూసుకోవాలి. చివరగా సమాధానాన్ని ఏ యూనిట్లలో అడిగారో చూసి అందులోకి మార్చి సమాధానాన్ని రాయాలి. ఉదాహరణకు మన సమాధానం వోల్టులలో వచ్చి, ప్రశ్నలో మిల్లీ వోల్టులలో సమాధానం ఇమ్మని అడిగినపుడు చూసుకోకుండా వోల్టుల్లో సమాధానం రాస్తే అది తప్పు అవుతుంది. కష్టపడి చేసిందంతా వృధా అవుతుంది. మరొక విషయం, మన సమాధానం ఎప్పుడూ గేట్ విడుదల చేసే సమాధానం యొక్క పరిధిలోనే ఉండాలి. మన సమాధానం 15.99 వచ్చి గేట్ విడుదల చేసే సమాధాన పరిధి 16-18 ఉంటే దాన్ని తప్పు సమాధానం కింద కంప్యూటర్ పరిగణిస్తుంది. కొన్నిసార్లు ఒక ఆప్షన్ ఎంచుకోబోయి కంగారులో వేరే ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీన్ని కూడా గమనించాలి. మన సమాధానాన్ని రెండు మూడు సార్లు రి చూసుకోవాలి.
7. కోచింగ్
ఈ పరీక్షకు చాలామంది విద్యార్థులు కోచింగ్ తీసుకుంటారు. కోచింగ్ తీసుకుంటే కలిగే లాభం ఏంటంటే పాఠం, నోట్సు వాళ్ళు చెప్తారు. వేగంగా చేయడానికి కిటుకులు, షార్ట్ కట్స్ నేర్చుకోవచ్చు మరియు ప్రాక్టీస్ టెస్టులు రాయవచ్చు. కానీ పూర్తిగా కోచింగ్ పైనే ఆధారపడటం కాకుండా మన కృషి కూడా కలిస్తేనే మంచి ఫలితం సాధించగలం.
***********
ఎంత చదివినా ఆ మూడు గంటల్లో మన మెదడు పనితీరుపై ఫలితం అనేది ఆధారపడుతుంది. Out of box ఆలోచించాల్సి వస్తుంది. కొన్ని ప్రశ్నలు కష్టంగా ఉన్నా ఆందోళన చెందకుండా, ఆశల్ని వదలకుండా స్థిరమైన మనసులో వేరే ఆలోచన లేకుండా పూర్తి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఒక్కోసారి పేపరు మొత్తం కష్టంగా రావచ్చు. అలాంటప్పుడు చాలా ఆందోళన కలుగుతుంది. అధైర్య పడకుండా మనకి బాగా వచ్చిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చి మిగతావి చివర్లో సమయం ఉన్నప్పుడు మాత్రమే పరిష్కరించాలి. రాని ప్రశ్నలకు సమాధానాలు అస్సలే పెట్టకూడదు.
మీకు కష్టంగా ఉన్న పేపరు అందరికీ కష్టంగా ఉంటుంది. మిగతా అభ్యర్థుల మార్కుల ద్వారా కటాఫ్ నిర్ణయించబడుతుంది. పేపరు కష్టంగా ఉన్నప్పుడు కటాఫ్ తక్కువగా ఉండచ్చు. సులభంగా ఉన్న పేపరులో కటాఫ్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది సులభంగా ఉన్న పేపరులో కూడా తప్పులు చేసి తమ ర్యాంకును పోగొట్టుకొనే ప్రమాదం ఉంది కాబట్టి ఆచితూచి సమాధానం రాయాలి. ఒక్కసారి అవకాశం చేజారితే మళ్లీ సంవత్సరం వరకూ రాదని గుర్తుంచుకోవాలి.
ఈ విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పరీక్షలో సబ్జెక్ట్ పై పట్టు, నిరంతర సాధన, వేగం, ఖచ్చితత్వాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా ఈ పరీక్షలో విజయం సాధించవచ్చు.
రచన: ప్రసాద రాజు©
ఫిజిక్స్ లెక్చరర్
మాజీ పరిశోధక విద్యార్థి (ఐఐటీ రూర్కీ, 2020-21 )
ఎం.టెక్ (పెట్రోలియమ్ జియోసైన్స్, ఐఐటీ బాంబే, 2020)
ఎమ్మెస్సీ (టెక్) భూభౌతిక శాస్త్రం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, 2018)
Comments
Post a Comment