సాలగ్రామాలు
హిందూ దేవాలయాలలో ముఖ్యంగా వైష్ణవ ఆలయాల్లో విష్ణుమూర్తి ప్రతిరూపంగా పూజింపబడే ఒక రకమైన నల్లని రాళ్ళని సాలిగ్రామాలు/సాలగ్రామాలు అంటారు.
ఇవి నేపాల్ లోని గండకీ నది పరీవాహక ప్రాంతమైన 'సాలిగ్రామం' అనే గ్రామం లో విరివిగా లభిస్తాయి. ఈ రాళ్ళు మృదువుగా అక్కడక్కడా కొన్ని గుర్తులతో అండాకారం లో ఉంటాయి.
ఆ గుర్తులు విష్ణువు యొక్క ఆయుధాలని చెప్పబడే శంఖం,చక్రం, గదలను మరియు విష్ణువు అవతారాలైన మత్స్య,కూర్మావతారాలను తలపించే విధంగా ఉండటం వలన ఆ రాళ్ళకు దివ్య శక్తులున్నట్లు ప్రజలు విశ్వసిస్తారు.
జియాలజీ పరంగా వాటిని 65 మిలియన్ సంవత్సరాల క్రితం (క్రెటేషియస్ శకం) అంతరించిపోయిన 'అమ్మో నైట్స్స్ ' అనే సముద్ర జీవజాతుల శిలాజ అవశేషాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. డైనొసార్లు అంతరించింది కూడా ఈ కాలంలోనే. ఆ ప్రదేశం వద్ద రెండు భూభాగాలను వేరు చేస్తూ మద్యలో 'తెథిస్' అనే సముద్రం ఉండేది. క్రమంగా ఆ భూభాగాలు రెండు దగ్గరికి జరిగి బలంగా ఢీకొని సముద్రపు నేల బయటకు చొచ్చుకువచ్చి నేటి హిమాలయాలుగా రూపాంతరం చెందాయి.

ఈ సంఘటన వల్ల అక్కడ ఉన్న సముద్రం మొత్తం కప్పబడి, అందులో ఉన్న జీవజాతులన్నీ నేలలోకి కూరుకుపోయి శిలాజాలు గా మారాయి. బలంగా ఉండే నత్త గుల్లలు, తాబేలు దొప్పలు, చేప ఎముకల ఆనవాళ్ళు మట్టి మీద అలాగే ఉండిపోయి కాలక్రమేనా ఆ మట్టి గట్టి రాళ్ళలాగా తయారయ్యాయి.
హిమాలయాల పైనుండి మంచు కరిగి ప్రవహించడం ద్వారా ఏర్పడ్డ గండకీ నది లో దొర్లుకుంటూ ప్రయాణించడం వల్ల రాళ్ళ ఉపరితలం మృదువుగా మారుతుంది . ఇదే తరహాలో యూరప్ లో కూడా పాములనుండి ఏర్పడిన 'సెర్పెంటిన్' అనే రాళ్ళకు దైవశక్తులు ఉన్నాయని ప్రజలు విశ్వసిస్తారు.
రచన: ప్రసాద రాజు©
ఫిజిక్స్ లెక్చరర్
మాజీ పరిశోధక విద్యార్థి (ఐఐటీ రూర్కీ, 2020-21 )
ఎం.టెక్ (పెట్రోలియమ్ జియోసైన్స్, ఐఐటీ బాంబే)-2020
ఎమ్మెస్సీ (టెక్) భూభౌతిక శాస్త్రం, ఆంధ్ర విశ్వవిద్యాలయం)-2018