బెంగాల్ బేసిన్లో మొదలైన చమురు ఉత్పత్తి
బెంగాల్ బేసిన్లో మొదలైన చమురు ఉత్పత్తి
ఓఎన్జీసీ క్రితం ఆదివారం బెంగాల్ బేసిన్లో మొదటిసారిగా చమురు ఉత్పత్తి ప్రారంభించింది. కేంద్ర చమురు, సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో అసోకనగర్ -1 బావి నుండి చమురు ఉత్పత్తి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మన దేశంలోని చమురు, సహజ వాయువులు ఉత్పత్తి చేసే బేసిన్లలో బెంగాల్ బేసిన్ ఎనిమిదవదిగా నిలిచింది.
ముంబై ఆఫ్ షోర్, క్యాంబే, కృష్ణ -గోదావరి, రాజస్థాన్, అస్సాం-అరకన్, అస్సాం షెల్ఫ్, కావేరి బేసిన్లు ఇప్పటివరకు హైడ్రో కర్బన నిక్షేపాలను ఉత్పత్తి చేస్తుండగా, కొత్తగా బెంగాల్ బేసిన్ కూడా ఆ జాబితాలో చేరింది.
శాస్త్రవేత్తల, ఇంజనీర్ల డెబ్భై ఏళ్ల కృషికి ఫలితంగా చమురు దిగుమతులను తగ్గించి, దేశ శక్తి భద్రతను కాపాడటంలో బెంగాల్ బేసిన్ కీలక పాత్ర పోషించనుంది. ఈ బేసిన్ యొక్క ఉత్పత్తి అంచనాలు పూర్తిగా బహిర్గతం కాకపోయినా, ఉత్పత్తి మాత్రం లాభదాయకమే అని ఓఎన్జీసీ ప్రకటించింది.
https://www.google.com/amp/s/m.economictimes.com/industry/energy/oil-gas/ongc-starts-oil-production-in-bengal-basin/amp_articleshow/79826753.cmsభారత దేశంలో చమురు మరియు సహజ వాయువు కార్యకలాపాలను నియంత్రించే సంస్థయిన డి.జి.హెచ్ (DGH-Director General of Hydrocarbons) లెక్కల ప్రకారం, మొత్తం 89000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం (నేలపై 57000 చ.కి.మీ, సముద్రంలో 32000చ.కి.మీ) కలిగిన బెంగాల్ బేసిన్లో 1949 నుండీ హైడ్రో కర్బన అన్వేషణ జరుగుతుండగా ఇప్పటివరకు తవ్విన 10 బావుల నుండి సేకరించిన సమాచారంతో ఉత్పత్తి ప్రారంభించే దిశగా అడుగులు వేసింది.
http://dghindia.gov.in/index.php/page?pageId=66బేసిన్ అంటే ఏమిటి
బేసిన్ అంటే ఒక ఖాళీ ప్రదేశం. టెక్టానిక్ ఫలకల చలనం మూలంగా బేసిన్ ఏర్పడుతుంది. ఆ ఖాళీ ప్రదేశంలో కొన్ని మిలియన్ సంవత్సరాలకు పూర్వం నదులు, సరస్సులు, హిమానినదాల ద్వారా అవక్షేపాలు వచ్చి జమవుతాయి. ఈ అవక్షేపాల్లో పెద్ద ఎత్తున జీవజాలం కూడా కలిసి, అక్కడ ఉష్ణోగ్రత, పీడనం, ఇంకా కొన్ని కారకాలు, హైడ్రోకర్బనాలు తయారయ్యే చర్యలు జరగడానికి అనువైన పరిస్థితులు కల్పిస్తే అది ఇప్పటికి శిలాజ ఇంధనాలుగా మారే అవకాశం ఉంటుంది. వీటిని చమురు బేసిన్లు అంటారు.
Lee, Eun Young & Novotny, Johannes & Wagreich, Michael. (2019). Subsidence Analysis and Visualization For Sedimentary Basin Analysis and Modelling. 10.1007/978-3-319-76424-5.
అన్ని బేసిన్లలో శిలాజ ఇంధనాలు ఉండాలని లేదు. కొన్ని బేసిన్లు ఏర్పడేటప్పుడు అవక్షేపాల్లో జీవజాలం లేకపోతే ఖనిజాలు, బొగ్గు, నీరు దొరకవచ్చు.
మన దేశంలో భూఉపరితలం, లోతు లేని సముద్ర భాగం (Shallow waters: నీటి లోతు 400మీ.), 'ప్రత్యేక ఆర్థిక ప్రాంతం' (Exclusive Economic Zone-EEZ) వరకు ఉన్న లోతైన సముద్ర భాగం (Deep water) కలిపి 3.5 మిలియన్ చ.కి.మీ వైశాల్యంతో మొత్తం 26 బేసిన్లు ఉన్నాయి. ఇందులో 16 బేసిన్లు భారత భూభాగంలో(Onshore) ఉండగా, 7 భూమి-సముద్రం(Onland and Offshore) రెండిటిలో ఉన్నాయి. 3 బేసిన్లు(ముంబై ఆఫ్ షోర్, అండమాన్ నికోబార్, కేరళ-కొంకణ్) పూర్తిగా సముద్రంలో ఉన్నాయి(Offshore).
http://dghindia.gov.in/index.php/page?pageId=66బేసిన్ల వర్గీకరణ
ప్రస్తుతానికి ఎనిమిది బేసిన్ల నుండి చమురు, సహజ వాయువులు ఉత్పత్తి అవుతున్నాయి. బేసిన్లను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని ప్రాతిపదికగా తీసుకుని వర్గీకరించారు.
కేటగిరీ-1 : ఈ బేసిన్లలో వాణిజ్య నిల్వలు ఎక్కువ ఉండి, ఉత్పత్తి జరుగుతున్నవి.
(కృష్ణ-గోదావరి, ముంబై ఆఫ్ షోర్, అస్సాం అరకన్, అస్సాం షెల్ఫ్, రాజస్థాన్, క్యాంబే, కావేరి మరియు కొత్తగా చేరిన బెంగాల్ బేసిన్). బెంగాల్ బేసిన్ అంతకు ముందు కేటగిరీ-3 లో ఉండేది, ఉత్పత్తి ప్రారంభించడం వల్ల ఒకటిలోకి చేరింది.
కేటగిరీ 2: ఈ బేసిన్లలో పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నా, ఉత్పత్తి ప్రారంభించాల్సినవి.
(కచ్, సౌరాష్ట్ర, అండమాన్, వింధ్య, మహానది)
కేటగిరీ 3 : ఈ బేసిన్లలో నిల్వలు ఉండే అవకాశం ఉండి, అన్వేషణ చేస్తున్నవి. (ఈ లిస్టు చాలా పెద్దది. కింద చిత్రంలో చూడచ్చు)
బెంగాల్ బేసిన్
తూర్పు కోస్తాలోని బేసిన్లన్నీ దాదాపుగా ఒకే మాదిరిగా ఏర్పడ్డాయి. ఖండాంతర చలన సిద్దాంతం మూలంగా 250 మిలియన్ సంవత్సరాల క్రితం అన్ని ఖండాలు కలిసి మహాఖండంగా ఉండేవని మనకి తెలుసు. దీన్ని 'ప్యాంజియా' అంటారు. ప్యాంజియాలో ఉన్నప్పుడు ప్రస్తుత భారతదేశ తూర్పు తీరం అంటార్కిటికాతో కలిసి ఉండేది. ప్రస్తుత పడమర తీరం తూర్పు ఆఫ్రికాలోని మడగాస్కర్ తో కలిసి ఉండేది.

Lal, N. & Siawal, Ashesh & Kaul, Anil. (2009). Evolution of East Coast of India- A Plate Tectonic Reconstruction. J. Geol. Soc. India. 73. 249-260. 10.1007/s12594-009-0081-1.
ఆ తరువాత 200మిలియన్ ఏళ్ల క్రితం ఖండాలన్నీ ప్యాంజియా నుండి విడిపోవడం (Rifting) మొదలయ్యి, భారత భూభాగం ఉత్తరంగా ప్రయాణం చేసింది. మన దేశానికి చమురు బేసిన్లు ఏర్పడటంలో ఈ ప్రయాణం, అప్పటి టెక్టానిక్ పరిస్థితులు ఎంతో కీలక పాత్ర వహించాయి. ( ఇది చాలా లోతైన సబ్జెక్టు కానీ ఆసక్తిగా ఉంటుంది. దీని గురించి ఎప్పుడైనా వీలున్నప్పుడు రాస్తాను).
ఉత్తరంగా ప్రయాణించిన భారత భూభాగం సుమారు యాభై మిలియన్ సంవత్సరాల క్రితం యూరేషియన్ ప్లేటును ఢీకొట్టడం వల్ల బెంగాల్ బేసిన్ ఏర్పడటం మొదలయ్యింది. ఈ ఫలితంగా ఖాళీ ప్రదేశం పుట్టి అక్కడ గంగా-బ్రహ్మపుత్ర నదుల వ్యవస్థ మూలంగా అవక్షేపాలు జమ కాబడి బేసిన్ పరిణామం చెందింది.
అన్వేషణ
భారత దేశంలో మొట్టమొదటిసారిగా చమురు అన్వేషణ 18వ శతాబ్దపు ఆంగ్లేయుల కాలంలో అస్సాంలో యాదృశ్చికంగా జరిగింది. అడవుల నుండి కలప మోసుకొస్తున్న ఏనుగుల కాళ్లకు చమురు అంటుకున్న ఆనవాళ్లు కనపడ్డాయి. భూమి లోపలి నుండి పగుళ్లు ద్వారా చమురు పైకి ఉబికి రావడం గుర్తించారు (Oil Seeps). అక్కడి అధికారులు 'Dig boy dig' అని అరవడం వల్ల ఆ ప్రదేశానికి డిగ్బాయ్ అని పేరు వచ్చింది. ఆ తర్వాత జరిగిన అన్వేషణల ఫలితంగా 1889లో డిగ్బాయ్ లో మొట్టమొదటి బావి నుండి చమురు ఉత్పత్తి ప్రారంభించారు.
https://mobile.twitter.com/indiahistorypic/status/1252297473999073280ప్రస్తుతం చమురు ఉత్పత్తిలో భారత్ 20వ స్థానం, సహజవాయువు ఉత్పత్తిలో 22వ స్థానంలో ఉంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే చమురు దిగుమతుల్లో మూడవ స్థానం, సహజవాయువు దిగుమతుల్లో 14వ స్థానంలో ఉంది.
https://www.worldometers.info/oil/india-oil/#:~:text=India%20produces%201%2C016%2C370.64%20barrels%20per,ranking%2020th%20in%20the%20world.https://www.worldometers.info/gas/india-natural-gas/#:~:text=India%20holds%2043%20trillion%20cubic,22.1%20times%20its%20annual%20consumption.బెంగాల్ బేసిన్లో హైడ్రోకర్బనాల అన్వేషణకు ఓఎన్జీసీ ఇప్పటివరకు 3361 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టగా, మరో 425 కోట్లతో బేసిన్ మొత్తంలో నిల్వల్ని అంచనా వెయ్యడానికి ఖర్చుచెయ్యనున్నారు.
https://www.google.com/amp/s/m.economictimes.com/industry/energy/oil-gas/ongc-starts-oil-production-in-bengal-basin/amp_articleshow/79826753.cmsప్రస్తుత లెక్కల ప్రకారం మన దేశ అవసరాల్లో 87 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. దాన్ని 67 శాతానికి కి తగ్గించే లక్ష్యంగా స్వంతంగా ఉత్పత్తి చెయ్యడం, పునరుత్పాదక వనరుల్ని అభివృద్ధి చేయడం, ఇథనోల్ ఇంధనం వాడకాలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించనుంది.
https://en.m.wikipedia.org/wiki/Oil_and_gas_industry_in_India#:~:text=India%20is%20heavily%20dependent%20on,account%20of%20crude%20oil%20imports.ధన్యవాదాలు.
Comments
Post a Comment