భారత దేశానికి ఉత్తరాన హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి?

మూడు వందల మిలియన్ ఏళ్ల క్రిందటి మాట..!

అంటే 30కోట్ల సంవత్సరాల క్రితం…

అనగనగా ఒక పేద్ద కుటుంబం. ఆ కుటుంబం ఎంతో కలిసి మెలసి సంతోషంగా జీవిస్తుండేవారు. ఎప్పుడూ ఒకర్నొకరు గట్టిగా హత్తుకునేంత గాఢమైన ప్రేమ వారి మధ్య ఉండేది. మరి అంత సంతోషంగా జీవిస్తున్న కుటుంబం అంటే విలన్లకి కళ్ళు కుడతాయి కదా.. ఈ విలన్ బాగా శక్తిమంతుడు.

ఆ మాటలూ, ఈ మాటలూ చెప్పి కుటుంబం మధ్య చిచ్చు పెట్టాడు. ఫలితంగా కుటుంబం రెండు కింద చీలిపోయింది. అంతటితో ఆగకుండా విలన్ మళ్లీ ఆ రెండు కుటుంబాల్లో విడిగా దూరి ఒకరంటే ఒకరికి పడనీకుండా చేసాడు. ఈ రెండు కుటుంబాలూ అప్పడంలా మరిన్ని ముక్కలయ్యి ఎవరికి వారు బ్రతుకుతెరువుకి తలో దిక్కుకీ పోవడానికి సిద్ధమయ్యారు. వీరి మధ్యలో ఒక కుటుంబం. తల్లి అనంతమ్మ, తండ్రి అప్పయ్య, పిల్లాడు భరత్.

నీకు ఈ గొడవలన్నీ ఎందుకు, పట్నమెళ్లి ఏదో పని చూసుకో నాయనా అని భరత్ కి తల్లితండ్రులు చెప్పడంతో ఒంటరి ప్రయాణం మొదలు పెట్టాడు. .

భరత్ ఉత్తరం వైపు బయల్దేరాడు. ఒకటా రెండా 10 కోట్ల సంవత్సరాల పాటు గొప్ప సాహస యాత్ర చేసాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మొత్తానికి ఐదు కోట్ల ఏళ్ల క్రితం తీరం చేరాడు. అక్కడ ఒక పెద్దన్నని ఢీకొని దందా మొదలు పెట్టాడు. దినదినాభివృద్ధి గడించాడు. ఈ ఐదు కోట్ల ఏళ్ల వ్యాపార అనుభవంతో ప్రపంచంలో అతి పెద్ద ధనవంతుల జాబితాలో మొదటి స్థానం సంపాదించుకున్నాడు. ప్రపంచం మొత్తం అటువైపు చూసేలా ఎంతో ఎత్తుకి ఎదిగిపోయాడు. ఎంత ఎదిగినా పెద్దన్న మీద మాత్రం ఇంకా ఆధిపత్యం ప్రదర్శించాలనే చూస్తున్నాడు.

ఇదేదో సినిమా కథ లాగా ఉంది కదా.. ఫ్యామిలీ సాంగ్ ఒకటే తక్కువ.

ఈ కథలో పెద్ద కుటుంబం- ప్యాంజియా (మహా ఖండం)

చిచ్చు- టెక్టానిక్స్

విలన్- భూగర్భంలో ఉష్ణ సంవాహన ప్రవాహాలు.

రెండు కుటుంబాలు - లోరేషియా, గోండ్వానా.

అప్పయ్య- ఆఫ్రికా(మడగాస్కర్), అనంతమ్మ- అంటార్కిటికా

భరత్ - భారత ఫలక.

పెద్దన్న- యురేషియన్ ఫలక.

ధనవంతుల జాబితాలో మొదటి స్థానం - హిమాలయాలు, ఎవరెస్టు ఎత్తు.

కథ పేరు - ప్లేట్ టెక్టానిక్స్.

(చిత్రం: Pangaea: When the Continents were Cuddling )


4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడినప్పుడు భూమి నిండా శిలాద్రవం పొయ్యి మీద పులుసు మరిగినట్టు మరిగేది. క్రమంగా భూ ఉపరితలం మీద వాతావరణం చల్లబడటంతో పైన పొర మాత్రం గట్టిబడి లోపల మరుగుతున్న శిలాద్రవం అలానే ద్రవరూపంలోనే ఉండిపోయింది. Crispy on the outside, juicy from inside అన్నమాట. ఈ గట్టి పొరను Lithosphere అందాం. ఈ Lithosphere మందం 200కిలోమీటర్లు.

(చిత్రాలు:The proto-Earth formed much faster than previously thought

Differences between the Earths’ Lithosphere and Asthenosphere )

భూమి అంతర్భాగంలో లోపలికి వెళ్లికొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. దీన్ని భూ ఉష్ణ ప్రవణత (Geothermal gradient) అంటారు. ఉష్ణోగ్రత ప్రవణత వల్ల శిలాద్రవం ఒకచోట స్థిరంగా ఉండక పైకి కిందకీ చక్రంలా తిరుగుతుంది.

ఒక పాత్రలో నీరు మరుగుతున్నప్పుడు మంటకు దగ్గర్లో ఉన్న నీరు వేడెక్కి, సాంద్రత తగ్గి పైకి తేలుతుంది, అక్కడ చల్లబడ్డాక సాంద్రత పెరిగి మళ్లీ కిందకి చేరుకుంటుంది. నీరు మరిగినంతసేపు ఈ ప్రక్రియ ఒక చక్రంలా జరుగుతుంది. ఇప్పుడు నీటిమీదేమనా బెండు ముక్కల్లాంటి వేసినప్పుడు ఈ ప్రవాహం మూలంగా ఆ బెండు ముక్కలు అటూ ఇటూ కదులుతుంటాయి. సరిగ్గా అదే ఫలకల చలనం విషయంలో కూడా జరుగుతుంది.

(చిత్రాలు: What are Convection Currents? )

భూగర్భంలో ఉష్ణ సంవాహక ప్రవాహాలు Lithosphere ని కొన్ని బలహీన ప్రదేశాల్లో చీలికలు చేశాయి. ఇలా చీలికలు కాబడ్డ భారీ వైశాల్యం కలిగిన ఒక్కొక ముక్కని 'టెక్టానిక్ ఫలక' అంటారు.

ఈ టెక్టానిక్ ఫలకలు కంటికి కనిపించనంత సూక్ష్మ వేగంతో చలనంలో ఉంటాయు. వీటి వేగం మనిషి గోళ్లు పెరిగే వేగంతో సమానం అంటుంటారు.

(చిత్రం: టెక్టానిక్ ఫలకలు)

ఫలకలు వివిధ దిశల్లో కదులుతూ అంచుల వద్ద ఒకదానికొకటి గుద్దుకోవచ్చు, దూరంగా జరగొచ్చు లేదా సమాంతరంగా కదలవచ్చు. ఒక గది నిండా జనాల్ని కుక్కి తలుపేసేస్తే ఎలా తోసుకుంటారో ఈ ఫలకల పరిస్థితి కూడా అంతే.

రెండు ఫలకలు గుద్దుకున్న చోట ఒక ఫలక మరో ఫలక కిందకి జారి భూఅంతర్భాగంలోకి వెళ్లిపోతుంది. ఇక్కడ భూమి నాశనమైంది అంటారు(Convergent plate boundaries).

మరోచోట రెండు ఫలకలు దూరంగా జరిగినపుడు మధ్యలో ఖాళీ ప్రదేశాన్ని శిలాద్రవం భర్తీ చేస్తుంది, అది గట్టిపడి కొత్త భూభాగం ఏర్పడుతుంది. ఇక్కడ భూమి సృష్టించబడింది అంటారు(Divergent plate boundadies).

సమాంతరంగా కదులుతున్నప్పుడు ప్లేట్లు ఒకదానికొకటి రుద్దుకొని పెద్ద ఎత్తున భూకంపాలు, చీలికలు ఏర్పడతాయి (Transform plate boundaries-శాన్ ఆండ్రియాస్ చీలిక దీనికి గొప్ప ఉదాహరణ.)

(చిత్రాలు: Figure 1.2 Schematic representation of the three types of plate... )

భూమి పైపొర గట్టిపడినప్పటి నుండి ఈ పలకలు ఒకదానికొకటి దూరం జరుగుతూ, దగ్గరవుతూ ఉంటాయి. దూరం జరిగినప్పుడల్లా ఆ ఖాళీలో సముద్రం ఏర్పడుతుంది. దగ్గరికొచ్చినప్పుడు సముద్రం మూసుకుపోతుంది. ఇది పునరావృతమవుతుంటుంది. ఈ ప్రక్రియను 'విల్సన్ చక్రం' అంటారు. ముందుగా కలిసి ఉన్న ఒక స్థిరమైన ఫలకలో చీలికలు ఏర్పడి రెండు ఫలకలుగా విడిపోయి దూరంగా జరుగుతాయి. కొన్నాళ్ళకి అందులో ఒకటి మళ్లీ రివర్స్ గేర్ వేసి వెనక్కి వచ్చి అదే ఫలకను ఢీకొంటుంది.

సముద్రాలు తెరుచుకోవడం, మూసుకుపోవడాన్నే విల్సన్ చక్రం అంటారు.

(చిత్రాలు: AMS Ocean Studies )

ఇలా అన్ని ఫలకలు ఒకేసారి దగ్గరికి చేరినప్పుడు 'మహా ఖండం' అనబడే భారీ టెక్టానిక్ ఫలక ఏర్పడుతుంది. మహాఖండాన్ని చుట్టుముట్టిన సముద్రాన్ని 'మహా మహాసముద్రం' అందాం.

భూమి ఆవిర్భావం నుండి ప్రస్తుత సమయం వరకు 7 మహాఖండాలు ఏర్పడ్డాయి, అలానే విడిపోతూ వచ్చాయి కూడా.

(చిత్రాలు: Supercontinent cycle | Wikiwand )

వీటిలో అత్యంత ఇటీవలి మహాఖండం 'ప్యాంజియా' 30కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. ప్యాంజియా చుట్టూ ఉన్న మహా మహాసముద్రం 'పాంతలెస్సా'.

200 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ మహాఖండం 'లోరేషియా', 'గోండ్వానా' అనే రెండు పెద్ద ఖండాలుగా విడిపోయింది. ప్రస్తుత కాలానికి అవి ఏడు ఖండాలు, ఐదు మహా సముద్రాలుగా మారాయి.

టెక్టానిక్ ఫలకల కదలికల సమాచారం నుండి వాటి భవిష్యత్ స్థానాలను అంచనా వేస్తారు. రాబోయే 10మిలియన్ సంవత్సరాలలో ఆఫ్రికా ఖండం నుండి తూర్పు ఆఫ్రికా విడిపోయి అక్కడ ఒక కొత్త సముద్రం ఏర్పడనుంది, యాభై మిలియన్ సంవత్సరాల తర్వాత అది యురేషియన్ ప్లేటును ఢీకొంటుందని అంచనా.

(చిత్రాలు: In 10 million years on, rift in Africa could give rise to a new continent, new peaks - Times of India )

అదే విధంగా, భవిష్యత్తులో ఏర్పడబోయే మహా ఖండాలను ఈ కింద చిత్రంలో గమనించవచ్చు. ఇలా జరగడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది.

(చిత్రాలు: The Next Pangea: What Earth’s Future Supercontinent Will Look Like )

సులభంగా చెప్పాలి అంటే టెక్టానిక్ ఫలకలు నిత్యం చలనంలో ఉంటాయి, ఈ చలనం చాలా నెమ్మదిగా జరుగుతుంది, ఫలకలు ఒకదానితో ఒకటి దోబూచులాడుకున్నప్పుడు భౌగోళికంగా భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. భూకంపాలు; సముద్రాలు తెరుచుకోవడం, మూసుకుపోవడం; పర్వత శ్రేణులు ఏర్పడటం అన్నీ టెక్టానిక్ చలనాల వల్లే జరుగుతున్నాయి.

భారత ఫలక(Indian plate) కథ:

250 మిలియన్ సంవత్సరాల క్రితం మహాఖండం పాంజీయా ఉన్న సమయంలో భారత భూభాగం పశ్చిమాన ఆఫ్రికాతోనూ, తూర్పున అంటార్కిటికాతోనూ, ఈశాన్యాన ఆస్ట్రేలియాతోనూ కలిసి ఉండేది.

అక్కడి నుండి 50మిలియన్ సంవత్సాలు గడిచాక, అంటే 200 మిలియన్ సంవత్సరాల క్రితం మహాఖండం 'లారేషియా', 'గోండ్వానా' ఖండాలుగా విడిపోయాయి.

లారేషియాలో ఉన్న ప్రస్తుత ప్రదేశాలు- ఉత్తర అమెరికా, యూరేషియా, గ్రీన్ లాండ్.

గోండ్వానాలో ఉన్న ప్రస్తుత ప్రదేశాలు- దక్షిణ అమెరికా, ఇండియా, ఆఫ్రికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా.

(చిత్రాలు: Facts About Pangaea, Ancient Supercontinent )

180–170 మిలియన్ సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి దక్షిణ అమెరికా విడిపోయింది[3].

140మిలియన్ సంవత్సరాల క్రితం గోండ్వానాలో భారత భూభాగం ఆకృతి చీలిక జరిగింది.

100 మిలియన్ సంవత్సరాల క్రితం భారత భూభాగం చుట్టు పక్కల పలకల నుండి వేరుచేయబడి ఒంటరిగా ఉత్తరం వైపు(కొద్దిగా ఈశాన్యం వైపు అనుకోవచ్చు) కదలనారంభించింది.

ఈ చలనం వేగంగానూ (సంవత్సరానికి సుమారు 15 సెంటీమీటర్ల వేగం), శిలాద్రవ ప్రవాహాల మధ్యన, హాట్ స్పాట్లు అనబడే కురుపుల్లాంటి అగ్నిపర్వతాలను ఢీకొంటూ 6400+ కిలోమీటర్ల దూరం సాగిన సుదూర యాత్ర అది. భారతదేశంలో ప్రస్తుతం ఉత్పత్తిలో ఉన్న చమురు-సహజవాయు బేసిన్లు అభివృద్ధి చెందడానికి కూడా ఈ ప్రయాణం ఉపయోగపడింది.

(చిత్రాలు[4])

50 మిలియన్ సంవత్సరాల క్రితం ఉత్తరం వైపు ప్రయాణిస్తున్న భారత ఫలక యొక్క ఉత్తర, ఈశాన్య భాగం యూరేషియాని ఢీకొట్టగానే ఆ ఒత్తిడిని విడుదల చేసే క్రమంలో భూభాగం మొత్తం పైకి నెట్టబడింది. మధ్యలో టెథిస్ సముద్రం మూసుకుపోయింది. అప్పటివరకు వేగంగా ప్రయాణిస్తున్న భారత ఫలక వేగం 15సెం.మీ/సం నుండి 9 సెం.మీ/సం వరకు తగ్గిపోయింది. ఆ క్షణం నుండి అక్కడ భూభాగం ఎత్తు పెరుగుతూ వస్తుంది.

20 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి హిమాలయాల శిఖరాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుత భారత ఫలక వేగం ఉత్తరం వైపు సుమారు 2సెం.మీ./సం కాగా, యురేషియన్ ప్లేటు వేగం ఉత్తరం వైపు 0.78 సెం.మీ/సం. అంటే, భారత ఫలక యురేషియా మీద ఇంకా ఒత్తిడి కలగజేస్తూనే ఉంది. దీని మూలంగా ఈ మొత్తం ప్రాంతం క్రియాశీలంగా ఉంటూ తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. హిమాలయాలు అన్ని పర్వత శ్రేణులకన్నా ఇటీవలే ఏర్పడటం వల్ల చురుగ్గా ఉంటూ ఏడాదికి సెంటీమీటర్ పైనే ఎత్తు పెరుగుతున్నాయి. సమయం గడిచేకొద్దీ ఈ చురుకుదనం తగ్గిపోతుండవచ్చు.

భారత ఫలక ఢీకొన్నప్పుడు జరిగిన తాకిడికి ఇక్కడ భూభాగం ముడతలు పడింది. అందుకే హిమాలయాలను 'ముడత పర్వతాలు(Folded mountains)' అంటారు.

భారత దేశానికి ఈశాన్యంలో 'నాంచా బర్వా' నుండి వాయువ్యంలో 'నంగా పర్బత్' వరకు 2500 కిలోమీటర్ల మేర వక్ర ఆకృతిలో హిమాలయాలు విస్తరించి ఉన్నాయి[5].

ఖండాలు ఢీకొనే ప్రక్రియకు హిమాలయాలు గొప్ప ఉదాహరణ. ఈ ప్రక్రియని 'Orogeny' అంటారు. ఈ ప్రదేశంలో ఒక ఫలకపై మరొక ఫలక చేరి అక్కడ భూమి పైపొర రెండింతలు మందంగా తయారవుతుంది.

( చిత్రం:Himalayas - Wikipedia )

హిమాలయ పర్వత శ్రేణిలో ప్రపంచంలోనే అతి పెద్ద పర్వత శిఖరమైన 'ఎవరెస్టు(8848.86 మీ.) తో పాటు K2(8611మీ.), కాంచన జంగా (8586 మీ.), లోట్సే(8516మీ.) లాంటి పెద్ద శిఖరాలు, 7000మీ. ఎత్తు పైబడి 50 వరకు హిమాలయాల్లో ఉన్నాయి.

యూరప్లోని 'ఆల్ప్స్' పర్వతాలు కూడా 'Orogeny' ప్రక్రియ ద్వారానే ఏర్పడ్డాయి. ఇక్కడ యూరోపియన్ ఫలకని ఆఫ్రికన్ ఫలక ఢీకొట్టింది. పాపం యురేషియా ఫలకని అందరూ కొట్టడమే.

(చిత్రాలు: Alps - Wikipedia )

హిమాలయాలు ఏర్పడక ముందు అక్కడ సముద్రం ఉండేదన్నట్టు రుజువుగా అక్కడ సున్నపురాయిలో సముద్ర జీవుల శిలాజాలు దొరికాయట. అలాగే, గండకీ నది ఒడ్డున విరివిగా దొరికే సాలగ్రామాల గురించి ఇప్పటికే రాసాను.

(చిత్రాలు: Why Are There Fish Fossils High Up In The Himalayas? | The Weather Channel - Articles from The Weather Channel | weather.com )

Comments

Popular posts from this blog

భూకంపాలు ఏ విధంగా సంభవిస్తాయి? ఎక్కడ సంభవిస్తాయి? మన దేశంలో భూకంపాలు సంభవించే ప్రాంతాలు ఏమిటి?

కొన్ని సముద్రతీరాల్లో (బీచ్‌ల్లో) నల్లటి ఇసుక ఉంటుంది. ఎందుకు?

ఎవరెస్టు ఎత్తుల కొలతల్లో తేడాలు?